Pages

Subscribe

ప్రథమ స్కంధము 203 - 216

అధ్యాయము - ౯ (9)

క. 203
అని ఇట్లు ధర్మసూనుఁడు, మొనసి నిరాహారభావమున దేవనదీ
తనయుడుఁ గూలినచోటికిఁ, జనియెఁ బ్రజాద్రోహ పాపచలితాత్ముండై


-: ధర్మరాజు శ్రీకృష్ణసహితుండై శరకల్పగతుండగు భీష్మునికడ కేగుట  :-

వ. 204
అ య్యవసరంబునం దక్కిన పాండవులును, ఫల్గునసహితుండైన పద్మలోచనుండును, కాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజుంగూడిచన, నతండుగుహ్యక సహితుండైన కుబేరునిభంగి నొప్పె. ఇట్లు పాండవులు పరిజనులు గొలువఁ బద్మనాభ సహితులై కురుక్షేత్రంబున కేగి, దివంబునుండి నేలం గూలిన దేవత తెఱంగున సంగ్రామ పతితుండైన గంగానందనునకు నమస్కరించిరి. అంత బృహదశ్వ భరద్వాజ పరశురామ గౌతమ పర్వత నారద బాదరాయణ కశ్యపాంగిరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వసిష్ఠా ద్యనేక రాజర్షి బ్రహ్మర్షులు శిష్యసమేతులై చనుదెంచినం జూచి సంతసించి దేశ కాల విభాగవేదియైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి.

క. 205
మాయాంగీకృత దేహుం, డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డై నాఁడని ప్ర
జ్ఞాయత చిత్తంబున గాం, గేయుఁడు పూజనము సేసెఁగృష్ణున్ జిష్ణున్.

వ. 206
మఱియుం గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండునందనులంగూర్చుండ నియోగించి, మహానురాగ జనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె.

ఆ. 207
ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగాఁ, బ్రతుకఁదలఁచి మీరు బహువిధముల
నన్నలార! పడితి రాపత్పరంపర, లిట్టి చిత్రకర్మ మెందుఁగలదె!

ఉ. 208
సంతస మింత లేదు మృగశాప వశంబునఁ బాండు భూవిభుం
డంతము వొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో
నింతటి వారిఁగా బెనిచె నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ
కుంతి యనేక దుఃఖములఁ గుందుచు నున్నది భాగ్యమెట్టిదో!

ఉ. 209
దాయు వశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాంతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచునుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.

ఉ. 210
రాజఁట ధర్మజుండు సురరాజ సుతుండఁట ధ్వని శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లఁట సారథి సర్వభద్ర సం
యోజకుఁడైన చక్రి యఁట యుగ్ర గదాధరుఁడైన భీముఁడ
య్యాజికిఁ దోడు వచ్చునఁట యాపద గల్గుట యేమిచోద్యమో!

ఆ. 211
ఈశ్వరుండు విష్ణుఁడెవ్వేళ నెవ్వని, నేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు?
నతని మాయలకు మహాత్ములు విద్వాంసు, లణఁగి మెలఁగుచుందు రందులగుచు.

వ.212
కావున దైవతంత్రం బైన పనికి వగవం బినిలేదు. రక్షకులు లేని ప్రజలు నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారయణుండు తేజోనిరూఢుండు గాక, యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబులం మోహతిరేకంబు నొందించును. అతని రహస్యప్రకారంబులు భగవంతుండైన శివుం డెఱుంగు. మఱియు దేవర్షియగు నారదుండును, భగవంతుడగు కపిల మునియు నెఱుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీపుత్రుండని మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధు మిత్రప్రయోజనంబుల నియమించుదు రిన్నిటంగొఱంతలేదు. రాగాది శూన్యుండు, నిరహంకారుం, డద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు నైన యీశ్వరునకున్నతోన్నతభావ మతివైషమ్యంబులెక్కడివి? లేవు? ఆయన భక్తవత్సలుండు గావున, నేకాంత భక్తులకు సులభుండై యుండు.

సీ.
అతిభక్తి నెవ్వనియందుఁ జిత్తము జేర్చి యెవ్వనినామ మూహించి పొగడి
కాయంబు విడుచుచుఁ గామ కర్మాది నిర్మూలనుండై యోగి ముక్తినొందు
నట్టి సర్వేశ్వరుం డఖిల దేవోత్తంసుఁ డెవ్వెళఁ బ్రాణంభు లేను విడుతు
నందాఁక నిదె మందహాసుఁడై వికసిత వదనారవిందుఁడై వచ్చి నేఁడు

తే. 213
నాల్గుభుజములుఁ గమలాభనయనయుగము, నొప్పఁగన్నుల ముందట నున్నవాఁడు
మానవేశ్వర నా భాగ్యమహిమఁజూడు, మేమి సేసితినో పుణ్యమితనిఁగూర్చి!.

వ.214
అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులు వినయంబున నాకర్ణించి మును లందఱు వినుచునుండ ధర్మనందనుండు మందాకినీనందనువలన (నరజాతి సాధారణబులగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును) రాగ వైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును, దాన ధర్మంబులును, హరితోషణంబులగు ధర్మంబులను, రాజధర్మంబులును, స్త్రీ ధర్మంబులును, శమ దమాదికంబులును, ధర్మార్ధ కామ మోక్షంబులును (నానా విధోపాఖ్యానేతిహాసంబులును) సంక్షేప విస్తార రూపంబుల నెఱింగె. అంత రధిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు వాంఛితంబగు నుత్తరాయణంబు చనుదెంచిన నది దనకు మరణోచిత కాలంబని నిశ్చయించి.

శా. 215
ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ
గ్జాలంబు హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టి విని
ర్మూలీభూత శరవ్యథా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరి.

వ. 216
ఇట్లు పరమేశ్వరుండైన హరియందు నిష్కాముండై ధారణావతియైన బుధ్ధిని సమర్పించి, పరమానందంబు నొంది, ప్రకృతి వలన నైన సృష్టిపరంపరలఁ బరిహరినంచు తలంపున మందాకినీనందనుం డిట్లనియె.

1 comments:

vsrao5- said...

భాగవతోత్తములకు నమస్కారము
మీ సైటు చాలా బాగుంది. చాలా అందంగా ఉంది
ముఖ్యంగా అంత మంచి బొమ్మలు ఎంత కష్టపడి సంపాదించారో. అభినందనలు
మీ విజిటర్ లొకేషన్, కామెంటు బాక్సు
కూడ చాలా బాగున్నాయి.
నా బ్లాగ్ - http://pothana-telugu-bhagavatham@blogspot.com/ - లో
పెట్టించకలరా.