Pages

Subscribe

ప్రథమ స్కంధము 226 - 231

ఆ. 227
ధనము లపహరించి తనతోడఁ జెనకెడు, నాతతాయి జనుల నని వధించి
బంధుమరణ దుఃఖభరమున ధర్మజుఁ, డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె.

వ. 228
అనిన సూతుండిట్లనియె.

క. 229
కురుసంతతికిఁ బరీక్షి, న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ
ధరణీ రాజ్యమునకు 'నీ శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించె.

వ. 230
ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబుగాని స్వతంత్రంబుగా దనునది మొదలగు భీష్ముని వచనంబుల హరి నంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును, నివర్తత శంకాకళంకుండును నై నారాయణాశ్రయుండైన యింద్రుండును బోలెఁ జతుస్సాగర వేలాలంకృతం బగు వసుంధరామండలంబు సహోదర సహాయుండై యేలుచుండె.

సీ.
సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గురియించు నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు ఫలవంతములు లతా పాదపములు
పండు సస్యములు దప్పక ఋతువులనెల్ల ధర్మమెల్లెడలను దనరి యుండు
దైవ భూతాత్మ తంత్రములగు రోగాది భయములు సెందవు ప్రజల కెందుఁ

ఆ. 231
గురుకులోత్తముండు కుంతీతనూజుండు, దాన మాన ఘనుఁడు ధర్మజుండు
సత్యవాక్యధనుఁడు సకల మహీరాజ్య, విభవ భాజియైన వేళయందు.

ప్రథమ స్కంధము 217 - 226

భీష్ముఁడు శ్రీకృష్ణుని స్తుతించుట

మ.217
త్రిజగన్మోహన నీలకాంతి తను వుద్దీపింపఁ బ్రాధాత నీ
రజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడు.

మ. 218
హయ రింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్ధున కిచ్చువేడ్కనని నా శస్త్రాహితం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతము.

మ. 219
నరుమాటల్విని నవ్వుతొ నుభయ సేనా మధ్యమక్షోణిలోఁ
బరు లీక్షింప రథంబు నిల్పి పర భూపాలావళిం జూపుచుం
బర భూపాయువు లెల్లఁజూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడు మనః పద్మాసనాసీనుఁడై

క. 220
తనవారిఁ జంపఁ జాలక, వెనుకకుఁబోనిచ్చగించు విజయుని శంక
ఘన యోగవిద్యఁ బాపిన, మునివింద్యుని పాదభక్తి మొనయు నాకు.

సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి, గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ
నుఱికిన నోర్వక యుదరంలో నున్న, జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ, బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక, మన్నింపు మని క్రీడి మఱలఁ దిగువఁ

తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి, నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁగాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖవృష్టిఁ, దెరలి చనుదెంచుదేవుండు దిక్కునాకు

మ. 222
తనకు భృత్యుఁడు వీనిఁ గాచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁజోద్యంబుగాఁ బట్టుచు
మునికోల న్వడిఁ జూపి ఘోటకముల న్మోదించి తాటింపుచు
జనుల న్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెద

మ. 223
పలుకుల నగవుల నడపుల, నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనుముల తాలిమి, కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలో

ఆ.224
మునులు నృపులు సూడ మును ధర్మజుని సభా, మందిరమున యోగమండపునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది, దేవుఁ డమరు నాదు దృష్టియందు

మ. 225
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జ
న్యకదంబంబుల హృత్సరోరుహముల నానావి ధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై

వ. 226
అని యిట్లు మనో వా గర్శనంబులం బరమాత్మయగు కృష్ణుని హృదయంబున నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దినావసానంబున విహంగంబు లూరక యుండు తెఱంగున నుండిరి. దేవ మానవ వాదితంబులై దుందుభి నినదంబులు మొరసె. సాధుజనకీర్తనంబులు మెఱసె. కుసుమవర్షంబులు గురిసె. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించు కృష్ణసహితుండై గజపురంబున గాంధారిసహితుండైన ధృతరాష్టృ నొడంబరచి, వారి సమ్మతంబున వాసుదేవానుమోదితుండై, పితృ పైతామహంబైన రాజ్యంబుగైకొని, ధర్మమార్గంబున బాలనంబు సేయుచుండె నని సూతుండు చెప్పిన విని శౌనకుండిట్లనియె.