Pages

Subscribe

ప్రథమ స్కంధము 241 - 243

అధ్యాయము - 11 

మ. 241
జలజాతక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారక
గలహంసావృత హేమపద్మ పరిఘా కాసారకన్ దోరణా
వళి సంఛాదిత తారక దరులతా వర్గానువేలోదయ
త్ఫల పుష్పాంకుర కోరక మణిమయ ప్రాకారక ద్వారక 

వ.242
ఇట్లు తన ప్రియపురంబు డగ్గఱి.

మత్తకోకిల.243
అన్యసన్నుత సాహనుండు మురారి యెత్తె యదాత్తముల్
ధన్యులై వినఁబాంచ జన్యము దారితాఖిల జంతు చై
తన్యమున్ భువనైక మాన్యము దారుణస్వన భీత రా
జన్యము బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యము.

ప్రథమ స్కంధము 232 - 240


శ్రీ కృష్ణుఁడు ద్వారకానగరమున కరుగుట

వ. 232
అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయుకొఱకును, సుభద్రకుం బ్రియము సేయుకొఱకును, గజపురంబునం గొన్ని నెలలుండి, ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయందలంచి, ధర్మనందనునకుం గృతాభివందనుండగుచు నతనిచేనాలింగితుండై యామంత్రణంబు వడసి, కొందఱు దనకుం నమస్కరించినం గౌఁగిలించికొని, కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు రథారోహణంబు సేయు నవసరంబున, సుభద్రయు ద్రౌపదియుఁ గుంతియు నుత్తరయు గాంధారియు ధృతరాష్టృండును విదురుండును యుధిష్ఠిరుండును యుయుత్సుండును గృపాచార్యుండును నకుల సహదేవులను వృకోదరుండును ధౌమ్యుండును (సత్సంగంబువలన ముక్త దుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువనోపఁడట్టి) హరితోడి వియోగంబు నహింపక, దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబుల వలన నిమిషమాత్రంబున హరికి నెడలేనివారలైన పాండవులం, గూడికొని, హరి మరలవలెనని కోరుచు హరి చనిన మార్గంబు చూచుచు, హరి విన్యస్తచిత్తులై లోచనంబుల బాష్పంబు లొలుక నంతనంత నిలువంబడిరి. అయ్యవసరంబున

సీ.
కనకసౌధములపైఁ గౌరవకాంతలు గుసుమవర్షంబులు గోరి కురియ
మౌక్తికదామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ
నుద్ధవ సాత్యకు లుత్సాహవంతులై రత్నభూషిత చామరములు వీవ
గగనాంతరాళంబు గప్పి కాహళభేరి పణవవశంఖాది శబ్దములు మొరయు    

ఆ. 233
సకల విప్రజనులు సగుణనిర్గుణరూప, భద్రభాషణములు పలుకుచుండ
భువన మోహనుండు పుండరీకాక్షుండు, పుణ్యరాశి హస్తిపురము వెడలె.

వ. 234    
తత్సమయంబునం బొరసుందరులు ప్రాసాద శిఖరభాగంబుల నిలిచి, గోపాల
సుందరుని సందర్శించి, మార్గముల రెండుదెసలఁ గరారవిందంబులు సాచి
యొండొరులకుం జూపుచుం దమలోనం, దొల్లిటం బ్రళయంబున గుణంబులం
గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబునఁ
బ్రపంచాత్మకుండు నద్వితీయుండు నగుచు మేలై దీపించు పురాణపురుషుండీతం
 డనువారును, జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధుంచుట 
యెట్లనువారును, గ్రమ్మఱ న ప్పరమేశ్వరుండు నిజ వీర్య ప్రేరితయై
నిజాంశభూతంబులైన జీవులకు మోహినియైన సృష్టి సేయ నిశ్చయించి,
నామరూపంబులు లేని జీవులందు నామరూపంబులు గల్పించు కొఱకు
వేదంబుల నిర్మించి మాయానుసరణంబు సేయు ననువారును, నిర్మల
భక్తి సముత్కంఠా విశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంతు రనువారును,
యోగమార్గంబులం గాని దర్శింపరా దనువారునై మఱియు.

మ.235
రమణీ! దూరమువోయెఁ గృష్టురథమున్ రాదింక వీక్షింప నీ
కమలాక్షుం బొడగానలేని దినముల్ గల్పంబులై తోచుఁ గె
హములం దుండఁగనేల పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం
దము రమ్మా! యనె నొక్క చంద్రముఖి గందర్పాశుగభ్రాంతయై

మ.236
తరుణీ! యాదవరాజు గాఁడితఁడు వేదవ్యక్తుఁడై యొక్కఁడే
వరుస లోకభవ స్థితి ప్రళయముల్ వర్తింపఁగాఁజేయ దు
స్తర లీలరతుఁడైన యీశుఁ డితనిన్ దర్శించితిం బుణ్యభా
సుర నేనంచు నటించె నొక్కతె మహా శుద్ధాంతరంగంబున

క.237
తామసగుణములగు రాజులు, భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స
త్వామలతనుఁడై యీతఁడు, భామిని! వారల వధించుఁ బ్రతికల్పమున 

సీ
ఈ యుత్తమశ్లోకుఁ డెలిమి జన్మించిన యాదవ కులమెల్ల ననఘ మయ్యె
నీ పుణ్యవర్తనుఁడె పొద్దు నుండిన మథురాపురము దొడ్డ మహిమ గనియె
నీ పూరుషశ్రేష్ఠ నీక్షించి భక్తితో ద్వారకావాసుల ధన్యులైరి
యీ మహాబలశాలి యెఱిఁగి శాసింపఁగ నిష్కంటకం బయ్యె నిఖిలభువన

తే.
మీ జగన్మోహనాకృతి నిచ్చగించి, పంచశర భల్లజాల విభజ్యమాన
వివశ మానసమై వల్లవీసమూహ, మితని యధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు.

ఉ. 239
ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁగాఁ
జేకొని వేడ్కొఁ గాఁపురము సేయుచునుండెడి రుక్మిణీముఖా
నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా
స్తోక్త విశేష తీర్థములఁ దొల్లిటిబాముల నేమి నోఁచిరో

వ. 240
అని యిట్లు నానావిధంబులైన పురసుందరీ వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు
నగరంబు వెడలె. ధర్మజుండును హరికి రక్షకంబులై కొలిచి నడువం జతురంగంబులు
బంపినఁ దత్సేనాసమేతులై తన తోడి వియోగంబునకు నోర్వక దూరంబు వెనుతగిలిన
కౌరవుల మరలించి, కురు జాంగల పాంచాల శూరసేన యామున భూములం గడిచి,
బ్రహ్మవర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌవీ రాభీర విషయంబు
లతిక్రమించి, తత్త ద్దేశనివాసు లిచ్చిన కానుకలు గొనుచు నానర్త మండలంబు
సొచ్చి పద్మబంధుండు పశ్చిమసింధు నిమగ్నుండైన సమయంబున
బరిశ్రాంతవాహుండై చని చని.  

ప్రథమ స్కంధము 226 - 231

ఆ. 227
ధనము లపహరించి తనతోడఁ జెనకెడు, నాతతాయి జనుల నని వధించి
బంధుమరణ దుఃఖభరమున ధర్మజుఁ, డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె.

వ. 228
అనిన సూతుండిట్లనియె.

క. 229
కురుసంతతికిఁ బరీక్షి, న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ
ధరణీ రాజ్యమునకు 'నీ శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించె.

వ. 230
ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబుగాని స్వతంత్రంబుగా దనునది మొదలగు భీష్ముని వచనంబుల హరి నంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును, నివర్తత శంకాకళంకుండును నై నారాయణాశ్రయుండైన యింద్రుండును బోలెఁ జతుస్సాగర వేలాలంకృతం బగు వసుంధరామండలంబు సహోదర సహాయుండై యేలుచుండె.

సీ.
సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గురియించు నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు ఫలవంతములు లతా పాదపములు
పండు సస్యములు దప్పక ఋతువులనెల్ల ధర్మమెల్లెడలను దనరి యుండు
దైవ భూతాత్మ తంత్రములగు రోగాది భయములు సెందవు ప్రజల కెందుఁ

ఆ. 231
గురుకులోత్తముండు కుంతీతనూజుండు, దాన మాన ఘనుఁడు ధర్మజుండు
సత్యవాక్యధనుఁడు సకల మహీరాజ్య, విభవ భాజియైన వేళయందు.

ప్రథమ స్కంధము 217 - 226

భీష్ముఁడు శ్రీకృష్ణుని స్తుతించుట

మ.217
త్రిజగన్మోహన నీలకాంతి తను వుద్దీపింపఁ బ్రాధాత నీ
రజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడు.

మ. 218
హయ రింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్ధున కిచ్చువేడ్కనని నా శస్త్రాహితం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతము.

మ. 219
నరుమాటల్విని నవ్వుతొ నుభయ సేనా మధ్యమక్షోణిలోఁ
బరు లీక్షింప రథంబు నిల్పి పర భూపాలావళిం జూపుచుం
బర భూపాయువు లెల్లఁజూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడు మనః పద్మాసనాసీనుఁడై

క. 220
తనవారిఁ జంపఁ జాలక, వెనుకకుఁబోనిచ్చగించు విజయుని శంక
ఘన యోగవిద్యఁ బాపిన, మునివింద్యుని పాదభక్తి మొనయు నాకు.

సీ.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి, గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ
నుఱికిన నోర్వక యుదరంలో నున్న, జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ, బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక, మన్నింపు మని క్రీడి మఱలఁ దిగువఁ

తే.
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి, నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁగాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖవృష్టిఁ, దెరలి చనుదెంచుదేవుండు దిక్కునాకు

మ. 222
తనకు భృత్యుఁడు వీనిఁ గాచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁజోద్యంబుగాఁ బట్టుచు
మునికోల న్వడిఁ జూపి ఘోటకముల న్మోదించి తాటింపుచు
జనుల న్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెద

మ. 223
పలుకుల నగవుల నడపుల, నలుకల నవలోకనముల నాభీరవధూ
కులముల మనుముల తాలిమి, కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలో

ఆ.224
మునులు నృపులు సూడ మును ధర్మజుని సభా, మందిరమున యోగమండపునఁ
జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది, దేవుఁ డమరు నాదు దృష్టియందు

మ. 225
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జ
న్యకదంబంబుల హృత్సరోరుహముల నానావి ధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై

వ. 226
అని యిట్లు మనో వా గర్శనంబులం బరమాత్మయగు కృష్ణుని హృదయంబున నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దినావసానంబున విహంగంబు లూరక యుండు తెఱంగున నుండిరి. దేవ మానవ వాదితంబులై దుందుభి నినదంబులు మొరసె. సాధుజనకీర్తనంబులు మెఱసె. కుసుమవర్షంబులు గురిసె. మృతుండైన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించు కృష్ణసహితుండై గజపురంబున గాంధారిసహితుండైన ధృతరాష్టృ నొడంబరచి, వారి సమ్మతంబున వాసుదేవానుమోదితుండై, పితృ పైతామహంబైన రాజ్యంబుగైకొని, ధర్మమార్గంబున బాలనంబు సేయుచుండె నని సూతుండు చెప్పిన విని శౌనకుండిట్లనియె.